ఎస్పీ సమక్షంలో మావోయిస్టు సభ్యురాలి లొంగుబాటు
తక్షణ సహాయం కింద రూ.25వేలు అందజేత
ములుగు, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐపీఎస్ సమక్షంలో నిషేధిత CPI (మావోయిస్టు) పార్టీకి చెందిన సభ్యురాలు ముడియం రామే @ రజిత శుక్రవారం లొంగిపోయింది. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పోరు కన్నా ఊరు మిన్న–మన ఊరికి తిరిగి రండి” అవగాహన కార్యక్రమం ప్రభావంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలపై అవగాహన పెరగడంతో ఆమె మావోయిజాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి చేరినట్లు అధికారులు తెలిపారు. సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ పరిధిలో 9వ ప్లాటూన్ సభ్యురాలిగా పనిచేసిన రజిత, విజ్జాలు @ ఐతూ (DKSZCM) ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలసీ కింద లొంగిపోయిన వారికి నగదు రివార్డు, వైద్య సేవలు, పునరావాస సహాయం అందజేస్తుండగా, ఈ సందర్భంగా ఆమెకు తక్షణ పునరావాస ఆర్థిక సహాయంగా రూ.25 వేలను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు హింసను విడిచిపెట్టి లొంగిపోవాలని, వారి కుటుంబ సభ్యులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.









