విద్యుత్ షాక్‌తో 2 పాడిగేదెలు మృతి : పరిహారం కోరుతున్న రైతులు
ఏటూరునాగారం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: మండలంలోని షాపిల్లి గ్రామపంచాయతీలో పంట పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడడంతో రెండు పాడిగేదెలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీపురు మదనయ్య, రాందేని నరేష్‌లకు చెందిన గేదెలు పొలంలో మేత మేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. అకస్మాత్తుగా తెగిపడిన విద్యుత్ తీగల వల్ల గేదెలు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. అలాగే మృతిచెందిన పశువులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.









