పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలి
అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని సిపిఎం ఆందోళన
ఏటూరునాగారం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం మండల బృందం డిమాండ్ చేసింది. శివపురం, గోగుపల్లి, చిన్న బోయినపల్లి గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించిన అనంతరం సిపిఎం నాయకుడు దావూద్ మాట్లాడుతూ అధిక గాలులతో కూడిన వర్షాల వల్ల వరి పంట పూర్తిగా నేలకొరిగిందని, కోసిన ధాన్యం కూడా గాలులకు ఎగిరిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ఏడాది మే 14న గోగుపల్లి గ్రామంలో వాగు వద్ద ఎండబెట్టిన ధాన్యం ఆకస్మిక వర్షంతో 49 మంది రైతులది కొట్టుకుపోయిందని, రాష్ట్రవ్యాప్తంగా నష్టం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం మే 28, 2025న రూ.51.50 కోట్లు, ములుగు జిల్లాకు రూ.5.73 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఏడాది గడిచినా రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరగలేదని విమర్శించారు. నష్టపరిహారం అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని, తడిసిన ధాన్యం పేరుతో కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు 5 నుంచి 15 కేజీల వరకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి గత ఏడాది బకాయిలతో పాటు తాజా నష్టాలకు పరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టి.ఎల్. రవి, తోలెం కృష్ణయ్య, ఎండి యాకూబ్, రెడ్డి వెంకటరెడ్డి, యానాల నర్సిరెడ్డి, ఈసం నారాయణ, పెంచికల లక్ష్మీనారాయణ, ఈసం రమేష్, బత్తుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.









