నేతకాని కులానికి ప్రత్యేక కోటా, కేటగిరిలను కేటాయించాలి

నేతకాని కులానికి ప్రత్యేక కోటా, కేటగిరిలను కేటాయించాలి
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: నేతకాని కులస్తులకు ప్రత్యేక కోటతోపాటు కేటగిరిని కేటాయించాలని జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేతకాని కుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కుల వర్గీకరణ చేయడంతో నేతకానిలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎస్సీ నేతకాని సామాజిక వర్గం లక్ష 33 వేల జనాభా ఉందని పేర్కొనడం సరికాదన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో 4వేల జనాభా,ఏటూరునాగారం మండలంలో 7వేల జనాభా, కన్నాయి గూడెం మండలంలో 7వేల జనాభా, వాజేడు మండలంలో 7వేల జనాభా, నూగురు వెంకటాపురం మండలంలో 7వేల జనాభా, తాడువాయి మండలంలో వెయ్యి జనాభా, గోవిం దరావుపేట మండలంలో 700 జనాభా, ములుగు మండలంలో 400 జనాభా, ములుగు వెంకటాపురంలో 5000 జనాభా, సుమారుగా 40 వేల జనాభా ఒక్క ములుగు జిల్లాలోనే ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీగా బెల్లంపల్లి నియోజకవర్గం చెన్నూరు, మందమర్రి, గోదావరిఖని, మంచిర్యాల, జగిత్యాల, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, కాగజ్ నగర్ వివిధ ప్రాంతాలలో మొత్తం జనాభా 18 లక్షలు పైచిలుకే ఉందన్నారు. దరిదాపు ఈ నేతకాని ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారని దీనిపై ప్రభుత్వం మరొక సారి ఆలోచన చేసి రీ సర్వే చేసి మా నేతకాని సమాజానికి న్యాయం చేయాలన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ మూడు విభాగాలు చేశారు దానిలో మా నేతకాని సామాజిక వర్గాన్ని మూడవ కేటగిరీలో చేర్చడం వలన పూర్తి స్థాయిలో మా నేతకాన్ని ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మూడో కేటగిరీలోకి చేర్చడం వలన మా నేతకాని సమాజానికి అభివృద్ధి గాని, సంక్షేమ ఫలాలు కానీ అందే అవకాశం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మా నేతకాని సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసి మా నేతకానిలా పక్షాన నిలబడి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బక్కయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డిగొండ కాంతారావు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు కుమ్మరి చంద్రబాబు, రాష్ట్ర నాయకులు కొండగొలర్ల పోచయ్య, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్లు జాడి బోజరావు, బసారికరి నాగార్జున్, జిల్లా నాయకులు సునరికని శ్రీరాములు, వెంకటేష్, కుమ్మరి సంతోష్, జాడి నరేష్, బెడిక లక్షమయ్య, వివిధ మండలాల నేతకానీ కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.