Bade  Damodar | నేలకొరిగిన ఎర్రమందారం 

Written by telangana jyothi

Published on:

Bade  Damodar | నేలకొరిగిన ఎర్రమందారం 

– ముగిసిన దామోదర్ ప్రస్థానం

– బీజాపూర్​ ఎన్​కౌంటర్​ లో మరణించిన బడే చొక్కారావు అలియాస్​ దామోదర్​

– లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

– ప్రజాపోరాటాలతోనే ముగిసిన అన్నదమ్ముల ప్రస్థానం

– నాడు అన్న బడే నాగేశ్వర్​ రావు.. నేడు తమ్ముడు బడే చొక్కారావు

– శోకసంద్రంలో కాల్వపల్లి

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ప్రజా పోరాటాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచిన ఎర్ర సూరీడు నేలకొరిగిండు.. కూడు, గూడు, గుడ్డ నినాదంతో నిరుపేదల పక్షపాతిగా పేరుపొందిన పెద్దన్న భూతల్లిచెంతకు చేరిండు. విప్లవ యోధులను తయారు చేసి ప్రజా ఉద్యమాలతో అలుపెరుగని పోరు చేసిన ఎర్ర మందారం అసువులు బాసిండు. ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే దామోదర్​ అలియాస్​ బడే చొక్కారావు అలియాస్​ మల్లన్న తోపాటు మరో 17మంది భారీ ఎన్​ కౌంటర్​ లో మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ శనివారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ జిల్లాలోని ఉసుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారి కంకేర్ గ్రామంలో జనవరి 16న జరిగిన ఎన్​కౌంటర్​ తో ఉద్యమ ప్రస్థానం ముసిగింది. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. జడ్పీ మాజీ చైర్ పర్సన్​, బీఆర్​ఎస్​ నియోజకవర్గ ఇన్​చార్జి బడే నాగజ్యోతికి బాబాయ్​ అయిన దామోదర్​ 30ఏళ్లుగా మావో యిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేయగా ఆరు నెలల క్రితం సీపీఐ మావోయిస్టు పార్టీ కార్యదర్శి హోదాలో పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది.

–నాడు అన్న.. నేడు తమ్ముడు.. ప్రజల కోసం త్యాగాలు..

మావోయిస్టు నేత బడే చొక్కారావు అన్న బడే నాగేశ్వర్​ రావు సైతం మావోయిస్టు నేతగా కొనసాగి రాష్ట్రస్థాయి క్యాడర్​ వరకు ఎదిగాడు. 2000 సంవత్సరంలో తాడ్వాయి మండలం కాటాపూర్ లింగరాజు గుట్టలో జరిగిన ఎన్​ కౌంటర్​ లో మృతి చెందారు. ఆయనకు మేడారం జంపన్నవాగు పరిస రాల్లో భారీ స్థూపం కూడా కట్టించారు. అన్నను చూసి తమ్ముడు దామోదర్​ సైతం మావోయిస్టు పార్టీలో చేరి ఉద్యమపోరాటాలు చేస్తూ అంచెలంచలుగా ఎదిగారు. 30ఏళ్లపాటు తెలంగాణ, ఛత్తీస్​ఘడ్​, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్​ రాష్ర్టాల సరిహ ద్దు ఏజెన్సీ గ్రామాల్లో ప్రజా కోర్టులు నిర్వహించి అక్కడి ప్రజలకు చేరువయ్యాడు. కొన్నేళ్లుగా ఛత్తీష్ ఘడ్​, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​ పోలీసులు మావోయిస్టు దామోదర్​ కోసం వెతుకుతున్నా పట్టుపడకుండా కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇతనిపై ఛత్తీష్గడ్​ ప్రభుత్వం రూ.50లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షలు రివార్డు సైతం ప్రకటించాయి. కాంకేర్​ లో జరిగిన ఎన్​ కౌంటర్​లో మరణించడంతో ఒక్కసారిగా ఏజెన్సీగ్రామాలు ఘొల్లు మన్నాయి. కాల్వపల్లిలో దామోదర్​ తల్లి, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

– 18మంది వీరమరణం పొందారు : మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

నిరాయుధ గ్రామస్థులపై ప్రభుత్వం మారణకాండ చేపట్టిందని, క్షిపణి దాడికి దిగిందని, అందుకు గాను నిరసన తెలుపుతు న్నామని సీపీఐ మావోయిస్టు సౌత్​ బస్తర్​ డివిజనల్ కమిటీ కార్యదర్శి పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు నేతలు కామ్రేడ్ దామోదర్(ఎస్​సీఎం), హంగీ (పీపీసీఎం), దేవే(పీపీసీఎం, జోగా(పీపీసీఎం), నరసింహారావు (పీపీసీఎం), ఇతర కామ్రేడ్లకు లాంగ్ లివ్ అని తెలిపారు. భద్రతా దళాలు పూజారి కాంకేర్​ ప్రాంతంలో ఆపరేషన్​ పేరుతో క్రూరమైన, అమానవీయమైన అణిచితేత చర్యలు చేపడుతు న్నారని, పెట్టుబడిదారీ రాజ్యాధికారుల ఆదేశానుసారం సహజ వనరులను దోచుకోవడం కోసం దమనకాండ చేపడుతున్నారని ఆరోపించారు. అమరులైన వారిలో కామ్రేడ్ బడే చొక్కరావు (దామోదర్ దాదా) ధైర్యసాహసాలను ప్రదర్శించి, పోరాడుతూ అమరుడయ్యాడన్నారు. అతని మరణం పార్టీకి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని, అయితే అతని విప్లవాత్మక వారసత్వం వేలాది మంది కొత్త సహచరులకు స్ఫూర్తినిస్తుందన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now