మండల పరిషత్ కార్యాలయాల ప్రాంగణంలో ఇందిరమ్మ మోడల్ హౌస్
– లబ్ధిదారులకు అవగాహన కోసం నమూనా ఇల్లు నిర్మాణం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల పథకాలలో ఒకటైన ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను జిల్లా లోని తొమ్మిది మండలాల్లో ఆయా మండల పరిషత్ కార్యాలయాల ప్రాంగణాల్లో లబ్ధిదారులకు అవగాహన కోసం నిర్మించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశంపై మంగళవారం హౌసింగ్ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు నూగూరు వెంకటాపురం, వాజేడు మండల పరిషత్ కార్యాలయాల ప్రాంగణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మార్కింగ్ ఇచ్చారు. సుమారు 5 లక్షల రూపాయలతో లబ్ధిదారులకు ఆయా ఇంటి నిర్మాణ దశలను బట్టి నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉంటాయి. త్వరలో మోడల్ హౌస్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం, గృహ నిర్మాణ శాఖ సన్నద్ధమవుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.