రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
సేంద్రియ పద్ధతులతో మెరుగైన దిగుబడులు సాధించాలి
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి నవీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మధు మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి, అంతర పంటల పద్ధతులను పాటిస్తే నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చని వివరించారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూములు సారవంతం అవుతాయని తెలిపారు. అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులు జై అవినాష్ శర్మ మాట్లాడుతూ సంప్రదాయ యూరియాకు బదులుగా నానో యూరియా, నానో డీఏపీ వాడకం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్లు మన్యం సునీల్ బాబు, పల్నాటి నాగేశ్వరరావు, కొండపర్తి సీతాదేవి, ఏఈఓలు, ఎరువుల డీలర్లు, రైతులు పాల్గొన్నారు.









