గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచ్లు చురుగ్గా పాల్గొనాలి
వెంకటాపురం (నూగూరు), ఏప్రిల్ 28, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉప సర్పంచ్ల మండల స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఉప సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కే. షరీఫోద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉప సర్పంచ్లు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఉప సర్పంచ్లు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం వెంకటాపురం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా ఉప్పెడు వీరాపూరం ఉప సర్పంచ్ గుండెల ప్రశాంత్ యాదవ్, గౌరవ అధ్యక్షుడిగా పాత్రాపురం ఉప సర్పంచ్ కొప్పుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా సురవీడు ఉప సర్పంచ్ కోర్సం మురళి, ఉపాధ్యక్షురాలిగా వి.ఆర్.కే పురం ఉప సర్పంచ్ పూనెం రాజేశ్వరీ, కోశాధికారిగా నూగూరు ఉప సర్పంచ్ రేగ లలితలను ఎన్నుకున్నట్లు తెలిపారు. మండలంలోని 14 గ్రామాల ఉప సర్పంచ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీలకు విడుదలయ్యే నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ఆదరణ పొందే విధంగా ఉప సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని సమావేశం తీర్మానించింది.









