జిల్లా కేంద్రంలో హనుమాన్ జెండాల తొలగింపుపై ఆందోళన
తొలగించిన జెండాలు, తోరణాలను మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్
కమిషనర్ తీరు మార్చుకోవాలి
ములుగు, ఏప్రిల్ 27, తెలంగాణ జ్యోతి: ములుగు పట్టణంలో జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసిన హనుమాన్ జెండాలు, కాషాయ తోరణాలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించడంపై హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన హిందూ సమ్మేళనం సందర్భంగా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర భారీగా ఏర్పాటు చేసిన జెండాలు, తోరణాలను తొలగించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ చర్యను నిరసిస్తూ సోమవారం ములుగు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ మాట్లాడుతూ హనుమాన్ జెండాలు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినవి కాదని, వాటిని పార్టీ జెండాలతో పోల్చి తొలగించడం తగదని అన్నారు. మే 12న జరగనున్న హనుమాన్ జయంతి దృష్ట్యా తొలగించిన జెండాలు, తోరణాలను మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పట్టణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









