వెంకటాపురంలో పెట్రోల్ బంకులపై యుద్ధమేఘాలు
మూడు రోజులుగా ఇంధనం నిల్, వాహనదారుల ఆవేదన
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 27, తెలంగాణ జ్యోతి: గల్ఫ్ యుద్ధ మేఘాల ప్రభావం ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంపై పడినట్లుగా కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఆయిల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పూర్తిగా నిలిచిపోవడంతో ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేసి బంకుల ను మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొంతమంది చిల్లర వ్యాపారులు ఆటోలలో ఇంధనం తీసుకువచ్చి లీటర్కు రూ.30 నుంచి రూ.40 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఏర్పడి వ్యవసాయ పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడిపి జీవనం సాగించే పేద కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ, వెంకటాపురం ప్రాంతంలో మాత్రం మూడు నాలుగు రోజులుగా బంకులు మూతపడటం గమనార్హం. వెంటనే ఇంధన సరఫరా పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, రైతులు, ప్రజలు జిల్లా అధికారులను కోరుతున్నారు.









