నాంచారమ్మ జాతరకు అధికారులకు ఆహ్వానం
వెంకటాపూర్, ఏప్రిల్29, తెలంగాణజ్యోతి:మే 1 నుంచి ప్రారంభమయ్యే నాంచారమ్మ జాతరకు రావాలని మండలాధికారులను తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం నాయకులు బుధవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లకొండ భాస్కర్, జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతిలు అధికారులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అనంతరం లోకిని రాజు మాట్లాడుతూ జాతర విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహకరించాలని కోరినట్లు తెలిపారు. నాంచారమ్మ ఆలయానికి సంబంధించిన భూమిని సర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని తహసీల్దార్ గిరిబాబును కోరగా, భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఎంపీడీవో మూడు రాజును విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ఐ చల్ల రాజును కోరినట్లు చెప్పారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఎరుకల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాంచారమ్మకు మొక్కులు చెల్లిస్తారని, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు హాజరవుతారని తెలిపారు. ప్రతి సంవత్సరం జాతర విజయవంతానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనేటి రాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మానుపాటి రమేష్, పల్లకొండ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.









