జిల్లా అభివృద్ధికి స్వేచ్ఛగా పని చేయండి: మంత్రి సీతక్క

On: May 8, 2026 6:51 PM

జిల్లా అభివృద్ధికి స్వేచ్ఛగా పని చేయండి: మంత్రి సీతక్క

జిల్లా అభివృద్ధికి స్వేచ్ఛగా పని చేయండి: మంత్రి సీతక్క

 కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష

 అధికారులకు మంత్రి కీలక దిశానిర్దేశం

 ఉపాధి హామీ కూలీలను పెంచాలని సూచన

ములుగు,మే8,తెలంగాణజ్యోతి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు హాల్లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ములుగు జిల్లా ఒక్కో రంగంలో క్రమంగా ముందుకు వస్తోందని, దీనిని మన ఇంటి పిల్లలు సాధించిన విజయంగా భావించవచ్చని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కరకట్టల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, షట్టర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, చెరువులు, కుంటల సమీప గ్రామాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత తనిఖీలు పూర్తి చేసి మిల్లుల వద్ద రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా చూడాలని, ధాన్యం ఎక్కడా నిల్వ కాకుండా వెంటనే తరలించాలని స్పష్టం చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేసి ఈ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున కూలీల సంఖ్య పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్పంచులను ప్రోత్సహించాలని డిఆర్డీఓ, డీపీఓలకు సూచించారు. కూలీల సంఖ్య పెరిగితే జిల్లాకు అధిక బడ్జెట్ కేటాయింపులు వస్తాయని, తద్వారా మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. జీపీ భవనాలు, వీవో భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారా నికి ప్రజా దర్బార్‌ను సమర్థవంతమైన వేదికగా ఉపయోగించాలని, ప్రత్యేక రూమ్‌తో పాటు ప్రత్యేక అధికారిని కేటాయించి వారానికి రెండు మూడు సార్లు నిర్వహించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను మంచినీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులకు నిబంధనల ప్రకారం వినియోగించాలని, పాత బిల్లుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో తొలి స్థానం సాధించడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో విద్య, వైద్యం, పంచాయతీరాజ్ శాఖలు కూడా 100 శాతం లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జిల్లాలో తాము ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నామని, అధికారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అధికారులతో పరిచయం, సమన్వయం కోసం ఈ ఇంటరాక్షన్ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కొత్త కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధికి స్వేచ్ఛగా పని చేయండి: మంత్రి సీతక్క

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!