గుర్తుతెలియని వాహనం ఢీకొని ఐదు గేదెల మృతి
రైతుకు భారీ నష్టం.. యజమాని కన్నీరుమున్నీరు..
వెంకటాపురం నూగూరు, మే 9, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం–భద్రాచలం ప్రధాన రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఐదు గేదెలు మృతి చెందాయి. మండల పరిధిలోని పాత్రపురం పంచాయతీ బల్లకట్టు వాగు దాటిన తర్వాత ప్రధాన రహదారిపై మేతకు వెళ్తున్న గేదెల గుంపుపై వేగంగా వచ్చిన వాహనం దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంతో గేదెల గుంపు చెదురుమదురుగా పరుగులు తీయగా ఐదు బలిష్టమైన గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న పాత్రపురం సర్పంచ్ పుష్పవతి, ఉప సర్పంచ్, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన గేదెలు వాగు అవతల ఉన్న ఉప్పేడు వీరాపురం పంచాయతీ గొల్లగూడెం ప్రాంతానికి చెందిన రైతువిగా భావిస్తున్నారు. ఈ ఘటనపై వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గేదెలు మృతి చెందడంతో యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు. వాగు వద్ద సేదతీరిన గేదెలు రోడ్డెక్కి మేతకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.









