మాలోత్ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల మండిపాటు
ములుగు, మే 8, తెలంగాణ జ్యోతి: మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ములుగులో నిర్వహించిన సమావేశంలో ములుగు గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి మాట్లాడుతూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయ అవకాశాలు పొందిన వారు అదే పార్టీపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా సేవ, అభివృద్ధి గురించి మాట్లాడే ముందు గతంలో ప్రజలకు చేసిన సేవల గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులో ముందుంటున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటిక ప్పుడు పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఇకపై రాష్ట్ర మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీపై అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









