సర్పంచ్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామంలో ప్రజా ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో కొంగాల సర్పంచ్ కళ్యాణి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామానికి చెందిన రోడ్డ అశోక్, బద్ది శ్రీకాంత్ కుటుంబాలకు చెందిన రెండు ఇండ్లను ప్రారంభించి, నూతనంగా గృహప్రవేశం చేసిన దంపతులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గూడు లేని వారికి నీడ కల్పించడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొంగాల ఉపసర్పంచ్ నగేష్, నాగారం మాజీ సర్పంచ్ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.









