అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.
తెలంగాణ జ్యోతి, కాళేశ్వరం : శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయమైన శ్రీ రామాలయంలో 10:31 గంటలకు శ్రీ రామాలయం అర్చకులు ఆరుట్ల రామాచార్యులు ఆధ్వర్యంలో దేవస్థాన అర్చక స్వాములు, వేద పండితులు, కళ్యాణ యాగ్నికులు చే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించ బడినది. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానము నుండి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించడం జరిగినది. కళ్యాణం అనంతరం దాతలకు, కళ్యాణ దాతలకు, అతిథులకు అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది. అనంతరం దేవస్థాన అన్నదాన సత్రంలో శ్రీ తారకనాథ్ రెడ్డి సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కళ్యాణమును తిలకించిన భక్తులకు నీల్వాయి గ్రామస్తులు మధు, సుమలత దంపతులు వడపప్పు, పానకం వితరణ జరిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవములో హనుమాన్ దీక్ష స్వాములు, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు, మహిళలు సుమారు 1000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ భవాని సేన్ ఎస్.ఐ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.