వయో వృద్ధుల హక్కులను గౌరవించడం అందరి బాధ్యత
– జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ఇన్చార్జి) సంపత్ రావు
ములుగు ప్రతినిధి : వయోవృద్ధులు సమాజానికి అమూల్య మైన సంపద అని, వారి హక్కులను గౌరవించడం అందరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ (ఇన్చార్జి స్థానిక సంస్థలు) సంపత్ రావు అన్నారు. మంగళవారం ములుగు కలెక్టరేట్ లో మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీడబ్ల్యూవో కె.శిరీష అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవానికి అదన పు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనల్ని కనిపెంచి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవడానికి కృషి చేసిన వయోవృద్ధులపట్ల సమాజంలో ఉన్న నిర్లక్ష్య పూరిత మైన భావజాలాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు. వయోవృద్ధులు సంరక్షణ చట్టాన్ని చట్టాన్ని మరింత కఠినంగా సవరించడం జరిగిందని అన్నారు. ప్రతీ బిడ్డ తమ తల్లిదండ్రుల ఆస్తులకు మాత్రమే వారసులు కాదని, వారి ఆలనా పాలనా చూడటంలో కూడా వారసత్వపు హక్కును కలిగి ఉంటారని తెలిపారు. 5జీయుగంలో కూడా మనిషి రోబోలా మారి తల్లిదండ్రులు, వృద్ధులపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష మాట్లాడుతూ.. వయోవృద్ధులు సమాజం అనే మహా వృక్షానికి బీజాలని, అలాంటి వయో వృద్ధులను సంరక్షించడం, వారిపై ప్రేమ చూపడం భాద్యతగా భావించా లని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో వృద్ధులకు వివిధ అంశాల్లో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అపపయ్య, వయోవృద్ధుల సంఘం నాయకులు జగన్నాథం, కస్తూర్బాగాంధీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సామ్రాజ్యం, రిటైర్డు ఉపాధ్యాయురాలు లక్ష్మీ కాంతమ్మ, జిల్లా బాలల పరి రక్షణ అధికారి జె.ఓంకార్, సీడీపీవోలు మల్లీశ్వరి, ప్రేమలత, ముత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.