పేదరికాన్ని జయించి ప్రతిభ చాటిన రాఘవి
విద్యార్థినిని సన్మానించిన రాష్ట్ర మంత్రి సీతక్క
వెంకటాపురం నూగూరు, మే 9, తెలంగాణ జ్యోతి: కటిక పేదరికం, తండ్రికి పక్షవాతం, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన యర్రావుల రాఘవి చదువుపై దృష్టి కోల్పోకుండా పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. కన్నాయిగూడెం గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాఘవి అత్యుత్తమ స్థాయిలో రెండో ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర మంత్రి సీతక్క శనివారం రాఘవిని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. భర్త అనారోగ్యంతో ఉన్నా కూలి పనులకు వెళ్తూ కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలని సంకల్పంతో ముందుకు నడిపిన తల్లి స్వరూప కృషి ఈ విజయానికి బలమైందని గ్రామస్థులు కొనియాడుతున్నారు. తమలాగా కష్టాలు పడకుండా బిడ్డ మంచి స్థాయికి చేరాలని తల్లి పెట్టుకున్న ఆశయాన్ని రాఘవి తన ప్రతిభతో నిజం చేయడంతో పేరూరు గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.









