వెంకటాపురంలో ఘనంగా హిందూ సమ్మేళనం
సనాతన విలువల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు సాగాలి
సద్గురు మహదేవ్ స్వామీజీ..
వెంకటాపురం నూగూరు, మే 9, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురంలో శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించగా చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు, ప్రజలు తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీశ్రీశ్రీ సద్గురు మహదేవ్ స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మంలోని విలువలు, సంస్కృతి, సామాజిక ఐక్యతను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వధర్మం పట్ల అంకితభావం, పరస్పర గౌరవం, ఏకాత్మతా భావనతో సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. కుటుంబ సమేతంగా హాజరైన ప్రజలు స్వామీజీ ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మందా శ్రీనివాస్, సేవికా సమితి నామోజు రమాదేవి ముఖ్య వక్తలుగా పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. “గడప లోపటే కులం.. గడప దాటితే హిందువులం” అనే సందేశంతో సామాజిక ఐక్యత అవసరాన్ని వివరించారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంగణం మారుమోగగా, హిందూ సమ్మేళనం సందర్భంగా వెంకటాపురం పట్టణ ప్రధాన వీధులను కాషాయ తోరణాలతో అలంకరించారు.









