గోదావరి మడుగులో మత్స్యకారుడు మృతి
లోతులోకి వెళ్లి మునిగిన వ్యక్తి
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నది మడుగులో చేపల వేటకు వెళ్లి ఒక మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఉప్పేడు వీరాపురం పంచాయతీకి చెందిన కోయబెస్తగూడెం గ్రామ నివాసి కుర్సం నాగేశ్వరరావు (45) తన భార్యతో కలిసి కూలి పనుల నిమిత్తం ఆరు నెలల క్రితం అంకన్నగూడెం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరి బండల మడుగులో చేపల వేటకు వెళ్లి లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంకటాపురం పోలీసులు రాత్రి వరకు శోధించినప్పటికీ మృతదేహం లభించలేదు. మంగళవారం ఉదయం పడవలు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.









