30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్
స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం
ములుగు, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కరావ్ అలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలుసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 25 సంవత్సరాల పాటు సాయుధ పోరాటంలో కొనసాగిన దామోదర్, ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి చేరిన విషయం తెలిసిందే. మంగళవారం గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్థులు, పాత మిత్రులు ఘన స్వాగతం పలికారు. పీపుల్స్ వార్ గ్రూప్ కాలంలో కాల్వపల్లి ఆయన ఉద్యమ ప్రస్థానానికి కీలక కేంద్రంగా నిలిచిందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచే ఆయన తన కార్యకలాపాలను ప్రారంభించి, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సహచరులతో ముచ్చటించిన ఆయన, ముందుగా తన తల్లి బతుకమ్మను కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పాత స్నేహితులతో మాట్లాడిన దామోదర్‌ను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. లొంగిపోయిన తర్వాత తొలిసారి స్వగ్రామానికి రావడం కావడంతో ఈ ఘటనపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.









