ప్రేమను అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
ప్రియుడి మృతి, ప్రియురాలు విషమ స్థితి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
కుటుంబాల నిరాకరణ భయంతో అడవిలో విషం సేవనం
ఏటూరునాగారం, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం విషాదానికి దారితీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాజేడు మండలం కృష్ణాపురానికి చెందిన ముక్త్యం సతీష్ (20), కొంగాల గ్రామానికి చెందిన దుబ్బ రవిత్రయని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించరనే భయంతో ఆదివారం మధ్యాహ్నం అటవీ కార్యాలయం సమీపంలోని అడవిలోకి వెళ్లి పురుగుమందు సేవించారు. ఈ ఘటనలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా, యువతి కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చి కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. సతీష్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం లభించగా, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.









