కుల గణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు
కుల గణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు
– మీ రాజకీయాల కోసం ప్రజల్లో అపోహాలు స్పష్టించొద్దు
– సర్వేను పారదర్శకంగా శాస్ర్తీయంగా నిర్వహించాం
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో కోరారు. ఇది రాజకీయాలు చేసేందుకు సరైన సమయం కాదంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు. కులగణన సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ ఇంటింటికెళ్లి వివరాలను సేకరించాం. ఆ సమాచారం ఆధారం గానే నివేదికను రూపొందించాం. అయినా.. కొందరు పనిగట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను అశాస్ర్తీయంగా నిర్వహించింది. పారదర్శకతకు పాతరేసి తప్పుల తడకగా నివేదికను తయారు చేసింది. సర్వే చేయించిన వారు ఆ వివరాలను ప్రజల ముందు పెట్టలేకపోయారు. శాసనసభలో పెట్టే సాహసం చేయలేదు. ఆ సర్వేకు ఎటువంటి ప్రామాణికత లేదు. అయినా దాని ప్రస్తావన 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెస్తున్నారు. ఆ తప్పును మేం సరిదిద్దాం. అందుకు మమ్మల్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ‘ప్రతిపక్షాలు బీసీలపై ఇప్పుడు కపట ప్రేమను ప్రదర్శిస్తు న్నాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ బీసీలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీనే. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపిస్తాం. రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు రూపొందించిన బీసీ డిక్లరేషన్ ను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని స్పష్టం చేశారు. ‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను కచ్చితంగా కేటాయిస్తాం. కాంగ్రెస్ కు బీసీల పట్ల ఉన్న చిత్త శుద్ధిని నిరూపించుకుంటాం. మరి.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ మాట చెప్పగలవా..?’ అంటూ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ చేయలేని ఎన్నో పనులను ఏడాదిలోనే మేం చేశాం. అందులో కుల గణన కూడా ఒకటి. అది చూసి బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారికి బీజేపీ నేతలు కూడా వంత పాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని ప్రజలను కోరుతున్నా. మీ రాజకీయాల కోసం ప్రజల్లో అపోహాలు స్పష్టించొద్దు’ అని ప్రతిపక్షాలకు సూచించారు.