ఎడతెరిపిన భారీ వర్షం.. రైతన్నల ఆందోళన…
సుడిగాలులతో పంటలకు తీవ్ర నష్టం
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 22 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో బుధవారం సాయంత్రం ప్రచండ వేగంతో వీచిన సుడిగాలులతో ప్రళయ గర్జనల మధ్య భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని ప్రకృతి విలయతాండవం చేసినట్లు పరిస్థితి నెలకొంది. సుమారు గంటన్నరకు పైగా గాలి దుమారం తో కూడిన వర్షం కురవడంతో ఆరబోసిన యాసంగి వరి ధాన్యం, మిర్చి కల్లాలు తడిసి ముద్దయ్యాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి, మామిడి, యాసంగి వరి పంటలు దెబ్బతినడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాలు రావడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మబ్బులు కమ్మిన వాతావరణం కొనసాగుతుండటంతో మరిన్ని వర్షాలు పడతాయనే భయంతో రైతుల గుండెల్లో ఆందోళన నెలకొంది.









