గ్రామాలకు నిరంతర విద్యుత్ సౌకర్యం
ఏటూరునాగారం, మే6,తెలంగాణజ్యోతి:ఏజెన్సీగ్రామాల్లో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సౌకర్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో రూ.1.46 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ఉపకేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ఉపకేంద్రం ద్వారా చిన్నబోయినపల్లితో పాటు పరిసర ప్రాంతాల్లోని 14 గిరిజన గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









