శబరిమలై కు తరలి వెళ్లిన అయ్యప్ప స్వాములు
శబరిమలై కు తరలి వెళ్లిన అయ్యప్ప స్వాములు
– అంగరంగ వైభవంగా ఇరుముడి కార్యక్రమాలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో బుధవారం అయ్యప్ప మాలధారణ భక్తులకు ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా గురు స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ భక్తుల బంధువులు, స్నేహితులు కుటుంబాలతో అయ్యప్ప స్వామి మందిరానికి తరలిరావడంతో, అయ్యప్ప స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. స్వామియే శరణమయ్యప్ప ,స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ భక్తులు స్వామివారి నామస్మరణలతో, అయ్యప్ప స్వామి ఆలయం దద్దరిల్లింది. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షాపరులు ప్రయాణించే వారి వారి ఇంధన శకటాలను శుభ్రంగా కడిగి శుద్ధిచేసి, వాహన చోదకులు మామిడి తోరణాలతో, పూలతో అలంకరించి, సిద్ధం చేశారు. సుమారు 40 మందికి పైగా అయ్యప్ప మాలధారణ భక్తులు, అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నుండి వెంకటాపురం పట్టణ ప్రధాన వీధులలో, స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శివాలయం వద్ద వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ నుండి వాహనాలపై మొక్కుబడులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఈ సందర్భంగా అశేష భక్త జనావళికి ప్రసాదాలను పంపిణీ చేశారు. అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర సందర్భంగా వెంకటాపురం పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయం తో పాటు, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా శివ స్వాములు,అయ్యప్పలు పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తి రస కార్యక్రమాల తో, వెంకటాపురం పట్టణంలో భక్తి రస సందడి నెలకొన్నది.