ఫర్టిలైజర్ డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం
స్టాక్ రికార్డులు పక్కగా ఉండాలి
వెంకటాపురం నూగూరు, మార్చి 31 తెలంగాణ జ్యోతి: ఫర్టిలైజర్ డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం నిర్వహించి స్టాక్ రికార్డులు పక్కగా నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం రైతు వేదికలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి ఎన్. నవీన్, మండల తహసీల్దార్ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఇన్పుట్ డీలర్లు స్టాక్ మరియు విక్రయాల వివరాలను రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే వారం నుంచి టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తనిఖీలు జరుగుతాయని తెలిపారు. ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా సహకరించాలని కోరారు. సమావేశంలో డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.









