చెరుకూరు–ధర్మవరం రోడ్డు నిర్మాణం చేపట్టాలి
అటవీశాఖ అడ్డంకులు తొలగించాలని సీపీఎం డిమాండ్
వెంకటాపురం నూగూరు, మే 23, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు నుంచి ధర్మవరం వరకు రహదారి నిర్మాణం పూర్తిచేయాలని, అటవీశాఖ అడ్డంకులను వెంటనే తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో చేరుకూరు–ధర్మవరం రహదారిని పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదని విమర్శించారు. ధర్మవరం నుంచి చేరుకూరు వరకు రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. ఇసుక లారీల రాకపోకల వల్ల రోడ్డు మరింత దెబ్బతిన్నదని, అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల మధ్య అటవీ భూమి ఉండటంతో రహదారి నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరాలు తెలుపుతూ పనులు నిలిపివేస్తోందని ఆరోపించారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అటవీశాఖ అధికారులతో చర్చించి వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని, లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గార సదక్రిన్, గౌరారపు చంద్రశేఖర్, బలుసుపాటి నరేష్, మహేందర్, అల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.









