ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

On: May 22, 2026 4:04 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్లు, 38 వేల కొత్త పెన్షన్లు

ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క వెల్లడి

ములుగు, మే 22, తెలంగాణ జ్యోతి: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి అర్హ కుటుంబానికి చేరవేయడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ములుగు లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల కార్యక్రమాలు పూర్తి చేసి జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తు న్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ములుగు జిల్లాలో 38 వేలకుపైగా కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. సంక్షేమ పథకాల అర్హుల జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేసి రోజు విడిచి రోజు రాగి జావ, వేడి పాలు అందిస్తామని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందిస్తామని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తామని చెప్పారు. రైతు భరోసా, మహాలక్ష్మి కింద రూ.500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేవని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ములుగు జిల్లాలో స్థానిక నిరుద్యోగ యువత కోసం 80 నుంచి 100 ప్రభుత్వ, ప్రైవేట్, బహుళజాతి సంస్థలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. యువత ను క్రీడల్లో ప్రోత్సహించాలని, గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రామచంద్రపూర్ శివారులో 10 వేల ఎకరాల పైచిలుకు భూములకు రీ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్త్రీనిధి ద్వారా 112 మహిళా సంఘాలకు రూ.2.25 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా 175 సంఘాలకు రూ.16.15 కోట్లు, ములుగు మున్సిపాలిటీ మెప్మ్ 25 సంఘాలకు రూ.2.02 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. 140 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 14 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా లీలా గార్డెన్ ఆవరణలో వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్‌డీఏ, రెడ్‌క్రాస్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి సీతక్క పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సుధీర్ రామ్నాద్ కేకన్, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వస్సల్ టోప్పో, జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్ రవీందర్ రెడ్డి,ఆర్డీవో వెంకటేష్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!