భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి
వాజేడు సదస్సుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసీలు
వెంకటాపురం, మే 24, తెలంగాణ జ్యోతి: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం న్యాయ కళాశాల సాధన సదస్సు నిర్వహించారు. గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. కార్యక్రమానికి గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, ముర్రం వీరభద్రం, ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొరస నర్సింహమూర్తి, వాసం నాగరాజు, పూసూరు దబ్బకట్ల సుమన్, చింతా సర్వేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత హక్కుల పరిరక్షణ, ఆదివాసీ యువత విద్యాభివృద్ధి కోసం భద్రాచలంలో న్యాయ కళాశాల అత్యవసరమని పేర్కొన్నారు. గతంలో పోరాటాల ఫలితంగా వచ్చిన జీవో నెంబర్ 3 ద్వారా ఆదివాసులకు ఉద్యోగాల్లో ప్రయోజనం కలిగిందని, ప్రస్తుతం ఏజెన్సీ చట్టాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ఆందోళనకరమని విమర్శించారు. న్యాయ కళాశాల ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంత యువతకు న్యాయ విద్యలో అవకాశాలు పెరిగి తమ హక్కులు, చట్టాల పరిరక్షణకు బలంగా నిలబడగలరని అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్ సాధన కోసం జిల్లాల వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. అనంతరం గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా, వాజేడు మండల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









