పోరు కన్నా ఊరు మిన్న.. మన ఊరికి తిరిగిరండి…
– ఎస్పీ డాక్టర్ శబరీష్
– మావోయిస్టు నేత దామోదర్ తల్లిని కలిసిన ఎస్పీ
ములుగు ప్రతినిధి : పోరుబాట కన్నా ఉన్న ఊరు మిన్న అని, ఊరికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని మావోయిస్టులకు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ పిలుపునిచ్చా రు. శుక్రవారం డీజీపీ ఉత్తర్వుల మేరకు తాడ్వాయి మండలం కాల్వపల్లిలో సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తల్లి బడే బతుకమ్మ, గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్న కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ భార్య సుజాతలను కలిసిన జిల్లా ఎస్పీ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. దామోదర్, ఆజాద్ లను తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలని కుటుంబ సభ్యుల ద్వారా పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఆదరణ తగ్గుతోం దని, ఇప్పటికైనా పార్టీని వదిలి సరెండర్ అయ్యి కుటుంబంతో గడపాలని ఆజాద్ భార్య సుజాత కోరినట్లు వివరించారు. బడే చొక్కారావ్ తల్లి బతుకమ్మ మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగాలేదని, వుండడానికి ఇల్లు కూడా లేదని, తనను చివరి క్షణాల్లో చూసుకోవాలని, సరెండర్ అయ్యి నాతో కలిసి జీవించా లని అని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని ఎస్పీ శబరీష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మావోయిస్టు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్, పస్రా సీఐ జి.రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పస్రా ఎస్సై కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.