చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి
అదనపు ఎస్పీ సదానందం
“Arrive Alive”లో భాగంగా వాహనదారులకు ఉచిత కంటి పరీక్షలు
ములుగు, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం భాగంగా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ములుగు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 150 మంది ఆటో, లారీ డ్రైవర్లు సహా వాహనదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సదానందం మాట్లాడుతూ చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని, చూపు స్పష్టంగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ శిబిరంలో డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్సైలు ఉపేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిపుణులైన కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు, మందులు అందజేశారు.









