ప్రజాపాలన మహాసభలో కీలక తీర్మానాలు
ఆరు గ్యారంటీలపై అవగాహన
మద్యనిషేధంపై ఏకగ్రీవ నిర్ణయం
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాత్రపురం రైతు వేదిక భవనంలో గురువారం “99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా మండల మహాసభ నిర్వహించారు. మండలంలోని 18 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మండల ప్రత్యేక అధికారి డి.సంజీవ్ అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జమ్మిలాల్, తహసీల్దార్ వేణుగోపాల్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు శాఖల అసిస్టెంట్ ఇంజనీర్లు, సీడీపీఓ, గ్రేడ్-1 సూపర్వైజర్ సుప్రియా, ఏపీఎం, ఏపీఓ, మండల విద్యాధికారి తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, శాఖల వారీగా పథకాల వివరాలు తెలియజేసి వాటి సమర్థవంతమైన అమలుపై చర్చించారు. కొత్త ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించి, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ చర్యలకు సంబంధించిన పలు తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా రామచంద్రపురం గ్రామపంచాయతీలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయడం, బెల్టు షాపులు మరియు గుడుంబా పూర్తిగా నిషేధించాలనే తీర్మానంతో పాటు మరో నాలుగు తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు.









