పాలెం వాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ పైన వంతెన నిర్మించాలని కలెక్టర్ కు వినతిపత్రం.
– ప్రాజెక్ట్ అధికారులు స్థానికంగా ఉండడం లేదని ఫిర్యాదు
– షెడ్యూల్డ్ ఏరియాలో పని చేసే అధికారులకు గిరిజన చట్టాల పైన అవగాహన కల్పించాలి.
– జిల్లాకలెక్టర్ ని కోరిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు గండ్లు పడిందని ప్రధాన రహదారి పైన వంతెన నిర్మించి పూర్తి స్థాయిలో ఆయకట్టు కు సాగు నీరు అందించాలని సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ను గ్రీవెన్స్ లో కలిసి ఎ.ఎన్ఎస్ నేత వినతి పత్రం అందజేశారు. పాలెం వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కు తరుచూ గండ్లు పడడానికి కారణం, వెంకటాపురం టు వాజేడు ప్రధాన రహదారి ఆరుగుంట పల్లి వద్ద రహదారి పై వంతెన నిర్మించక పోవడమే కారణం అని కలెక్టర్ కు వివరించారు. ప్రధాన కాలువ, ప్రధాన రహదారి క్రింద నుండి ప్రవహిస్తోందని, రోడ్డు కింది బాగాన చిన్న చిన్న పైపులు పెట్టడం వల్ల నీటి ప్రవాహ ఉదృతి అధికమై ఎగువ ప్రాంతంలో కాలువకు పలు చోట్ల గండ్లు పడుతున్నట్లు తెలిపారు. దిగువ ప్రాంతం లో ఉన్న బర్లగూడెం గ్రామపంచాయతీ లోని గిరిజన వ్యవసాయ భూములకు సాగు నీరు అందడం లేదన్నారు. ఈ ఏడాది సుమారు నాలుగు వేల ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు రభీ సీజన్లో ఎండిపోయాయి కలెక్టర్ కు తెలిపారు. బ్రిడ్జి మంజూరు అయి ఏడాది కావస్తున్న ఇప్పటివరకు నిర్మాణం పనులు మొదలు పెట్టలేదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతం లో పని చేసే వివిధ శాఖల అధికారులకు షెడ్యూల్డ్ చట్టాలు అయిన 1/70, పెసా, అటవీహక్కుల గుర్తింపు చట్టాల పైన కనీస అవగాహన లేదని అందువల్ల ఏజెన్సీ చట్టాలు అమలుకు నోచుకోక పోగా, ఉల్లంఘనకు గురి అవుతున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా గిరిజన చట్టాల పైన అన్ని శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ను కోరడం జరిగింది. ఏజెన్సీ విద్య కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా కుంటుపడుతోందని అన్నారు. కొందరు ఉపాధ్యాయులు ప్రతి రోజు జిల్లా కేంద్రం నుండి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలసి పోయి విద్య బోధనా సరిగా చేయడం లేదని అన్నారు. దీని కారణంగా ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యం దెబ్బతినడం, భోధన పైన ఆసక్తి లేకపోవడం, విద్యార్థి కేంద్రంగా బోధన చేయలేక పోతున్నట్లు కలెక్టర్ కు తెలిపారు. మారుమూల ఏజెన్సీ గ్రామాలు అయిన కొత్తగుంపు, తిప్పా పురం, ముత్తారం గ్రామాలకు సక్రమంగా టీచర్లు పాఠశాలకు వెళ్లడం లేదని ఆయా గ్రామాల ప్రజలు తెలిపినట్లు కలెక్టర్ కు తెలిపారు. . కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, గణితం చేయడం రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎప్పటికి అందని ద్రాక్ష లాగా ఉందన్నారు. ప్రాథమిక ఉచిత నిర్భంద, విద్య గిరిజన బిడ్డలకు అందించాలని కోరారు. పని వేళల్లో కొంతమంది ఉపాధ్యాయులు సెల్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నట్లు తెలిపారు. వెంకటాపురం మండలం లో మండల విద్యాశాఖ అధికారిని నియమించాలని కలెక్టర్ ని కోరారు.అన్ని సమస్యలను విన్న కలెక్టర్ దివాకర ఎస్ సానుకూలంగా స్పందించారు. విద్య పైన ప్రత్యేక దృష్టి పెడతామని తెలిజేశారు. పాలెం వాగు ప్రాజెక్ట్ అధికారులను వెంకటాపురం పంపించి, మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలు పెట్టిస్తా అని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు . ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు గిరిజన చట్టాల పైన ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధంగా చొరవ చూపుతామని కలెక్టర్ అన్నట్లు ఆయన అన్నారు.కత్తిగూడెం, రాజుపేట ఇసుక క్వారీల పైన సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహిస్తా మని లోపాలు ఉంటే చర్యలు తీసుకుంటా మని కూడా కలెక్టర్ దివాకర హామి ఇచ్చారని నర్సింహా మూర్తి తెలిపారు.