జాకారం హెరిటేజ్ వాక్‌తో ములుగు టూరిజం ప్రచారానికి శ్రీకారం
పర్యాటక అభివృద్ధికి ఇన్ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యం అవసరం
కలెక్టర్ హేమంత్
ములుగు, మే 20, తెలంగాణ జ్యోతి: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల సందర్భంగా బుధవారం ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్ నేషనల్ హైవే యూ-టర్న్ వద్ద నుంచి జాకారం శివాలయం వరకు హెరిటేజ్ వాక్‌ను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాకారం శివాలయం కాకతీయ కాలం నాటి అరుదైన వారసత్వ కట్టడమని, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించినట్లే ములుగులోనూ ఎన్నో గొప్ప పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. బొగత జలపాతం, లక్నవరం సరస్సు, మేడారం జాతర, తాడ్వాయి హట్స్, ఏటూరునాగారం ప్రాంతాలు పర్యాటకంగా అపార అవకాశాలు కలిగి ఉన్నాయని తెలిపారు. దేవాలయ, సరస్సు, అటవీ పర్యాటకం వంటి విభిన్న రంగాలు ఒకే జిల్లాలో ఉండటం ములుగు ప్రత్యేకత అని చెప్పారు. పర్యాటక రంగాన్ని సమర్థంగా ప్రమోట్ చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు. కేరళ, రాజస్థాన్ తరహాలో ప్రచారం చేస్తే ములుగు కూడా ప్రముఖ టూరిజం హబ్‌గా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. పర్యాటక ప్రచారం కోసం ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక పోటీ నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి మంచి సూచనలు స్వాగతిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి, బీడబ్ల్యూఓ ప్రేమలత, డీపీఓ వెంకయ్య, డీపీఆర్వో రఫిక్, తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీఓ రహీమ్, జాకారం సర్పంచ్ దాసరి సమత, టూరిజం శాఖ సిబ్బంది, గైడ్స్, టూరిస్ట్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.








