మెడికల్ షాపుల బంద్.. యూనియన్ ర్యాలీ
వెంకటాపురంలో 21 మెడికల్ షాపులు మూత
వెంకటాపురం నూగూరు, మే 20, తెలంగాణ జ్యోతి: దేశవ్యాప్త పిలుపులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బుధవారం మెడికల్ షాపులు పూర్తిగా బంద్ అయ్యాయి. ఏఐసీడీ, టీటీడీసీఏ యూనియన్ల ఆధ్వర్యంలో మండలంలోని 21 మెడికల్ షాపులను మూసివేసి వేపచెట్టు సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను నిలిపివేయాలని, నకిలీ మరియు నాణ్యత లేని మందుల అమ్మకాలను అరికట్టాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలను ఉపసంహరించు కోవాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, ములుగు జిల్లా మెడికల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బచ్చు పూర్ణచందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర మందులను యూనియన్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచి సేవలందించారు.








