గాంధీనగర్‌లో ఆదర్శ గ్రామ నిర్మాణంపై గ్రామసభ
బాలవికాస ఆధ్వర్యంలో ఎనిమిది అభివృద్ధి కమిటీల ఏర్పాటు
ములుగు, మే 18, తెలంగాణ జ్యోతి: గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ బానోతు నిర్మల వెంకన్న ఆధ్వర్యంలో సోమవారం బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణంపై అవగాహన గ్రామసభ నిర్వహించారు. సుమారు 350 మంది గ్రామ ప్రజలు పాల్గొన్న ఈ సమావేశంలో బాలవికాస ఆదర్శ గ్రామం పథకం సీనియర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వసంత మాట్లాడుతూ ఆదర్శ గ్రామం అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించుకోవడం మాత్రమే కాదని, గ్రామ ప్రజలందరూ క్రమశిక్షణ, ఐక్యత, పరస్పర సహకారంతో గ్రామ వనరులను సమర్థంగా వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవడమే నిజమైన ఆదర్శ గ్రామమని వివరించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ బానోతు నిర్మల వెంకన్న మాట్లాడుతూ బాలవికాస సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమానికి గ్రామపంచాయతీ పూర్తి సహకారం అందిస్తుందని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వల్లపు మహేష్, పంచాయతీ కార్యదర్శి రఘు, వార్డు సభ్యులు, బాలవికాస ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.









