వెంకటాపురంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు
హెల్మెట్, డ్రైవింగ్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన
వెంకటాపురం నూగూరు, మే 18, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం సెంటర్లో సోమవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్ఐ తిరుపతిరెడ్డి రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరిస్తూ సురక్షిత ప్రయాణంతో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. అనంతరం వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో సివిల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









