మే డేకు ఉపాధి కూలీలకు సెలవు ఇవ్వాలి
పెండింగ్ బిల్లులు చెల్లించాలి: సీపీఎం
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా ఉపాధి హామీ కార్మికులకు సెలవు ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న కూలీల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి మాట్లాడుతూ, May Day ప్రపంచ కార్మికుల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన రోజు కావడంతో మే 1న కార్మికులకు పని కల్పించడం తగదని పేర్కొన్నారు. ఉపాధి పనుల ప్రదేశాల్లో తాగునీరు, విశ్రాంతి కోసం టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ వంటి కనీస వసతులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా వెంటనే అవసరమైన సదుపాయాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులను విడుదల చేయాలని కోరారు. మండలంలోని అనేక పని ప్రదేశాల్లో సౌకర్యాల లేమిని కార్మికులు పార్టీ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దామోదర్, బచ్చల కృష్ణ బాబు, నరేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.









