ప్రమాద సమయంలో సీపీఆర్ కీలకం
యాక్సిడెంట్ బాధితులను కాపాడితే రూ.25వేల పారితోషికం
డీఎస్పీ కిషోర్ కుమార్
ములుగు, ఏప్రిల్ 17, తెలంగాణ జ్యోతి : ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్ తోపాటు ఫస్ట్ ఎయిడ్ కీలకమైందని, ప్రమాదం జరిగిన వ్యక్తిని కాపాడటం సమాజిక బాధ్యత అని డీఎస్పీ ఈ.కిషోర్ కుమార్ అన్నారు. ప్రమాదం జరిగిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25వేల పారితోషికం అందించనున్నట్లు పేర్కొన్నారు. అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ములుగు పోలీస్ స్టేషన్ లో సీపీఆర్, ప్రథమ చికిత్సలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ప్రమాదాలు జరిగినప్పుడు సమయానికి ప్రథమ చికిత్స అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ లో సరైన చికిత్స అందిస్తే అనేక ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి ఆస్పత్రికి తరలించడం అత్యంత ముఖ్యమని సూచించారు. యాక్సిడెంట్ బాధితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25వేల పారితోషికం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు సర్కిల్ ఇన్స్పెక్టర్ దారం సురేష్, ఎస్సైలు యు.ఉపేందర్, చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ అనీష్ కుమార్, 108 డీఎం రాజ్కుమార్, 108 సిబ్బంది, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.









