ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి 

Written by telangana jyothi

Published on:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి 

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి/ మహాదేవపూర్ :  మహాదేవపూర్ మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో మొత్తం ఎంత మంది వైద్యులున్నారు, విధులకు హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఎంతమంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్ర శేఖర్ ను వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం హాస్పిటల్ లోని ఆపరేషన్ ధియేటర్, డయాలిసిస్ సెంటర్ ఓపి విభాగాన్ని పరిశీలించారు. హాస్పిటల్ లో వైద్య పరికరాలకు అలాగే మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రతి పాదనలు అందచేయాలని సంబందిత వైద్యాధికారులను ఆదేశించారు. మండలం పరిధిలోని ప్రతి మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఎప్పటి కప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. ఆసు పత్రి ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశంలో పండ్లు, పూల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే కాలమని సిబ్బంది నిబద్దతతో పని చేసి సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఏ సమయంలో ప్రజలు అత్యవసర సేవలకు వస్తారో తెలియని పరిస్థితి కాబట్టి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా వంటి జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున అంటువ్యాధులు ప్రబలే గ్రామాల్లో అత్యవసర వైద్యసేవలు నిర్వహించి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే విధంగా వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. అనంతరం మండలంలోని మెట్ పల్లి, ఎస్సి కాలనిలో మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరుగకుండా నిరంత రాయంగా పనులు జరిగే విధముగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నపిల్లలతో కొద్దిసేపుముచ్చటించారు.అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు అందించే పోషక పదార్థాలు పరిశీలించి బాలా మృతం ప్యాకెట్ ను బాలింతకు అందించారు. కాళేశ్వరం నుండి కుంట్లమ్ గ్రామానికి వెళ్లే రహదారి పరిశీలించి 5 కిలో మీటర్ల మేర పాడైనందున అట్టి రోడ్డు నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయ నివేదికలు అందచేయాలని సంబంధిత పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయాన్ని సందర్శించి బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన ఉన్నందున చేపట్టే కార్యక్రమ వివరాలను సంబంధిత అధికా రులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పంచాయతీ రాజ్ ఈఈ దిలీప్, తహసీల్దార్ ప్రహలాద్, ఎంపీడీఓ చంద్రశేఖర్, పంచా యతీరాజ్ డిఈ సాయిలు, ఏఈ రవీందర్, మహాదేవ పూర్ సీడీపిఓ, రాధిక, ఎంపిపి రాణిభాయ్, ఐ సి టీ సీ కౌన్సిలర్ గాదె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now