వెంకటాపురంలో ఘనంగా అభయాంజనేయ జయంతి వేడుకలు
వందలాది మంది భక్తులతో ఆధ్యాత్మిక సందడి
వెంకటాపురం నూగూరు, మే 12, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి 25వ జయంతి మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే శ్రీ ఆంజనేయ స్వామి మందిరాల వద్ద భక్తులు భారీగా తరలివచ్చి దర్శనాలకు క్యూలు కట్టారు. పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు, సింధూర పూజ, నాగవల్లి దళార్చన, తెల్ల జిల్లేడు పుష్పార్చనలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ‘జై శ్రీరామ్’, ‘జై జై శ్రీరామ్’, ‘జైఆంజనేయ’ నినాదాలతో ఆలయ ప్రాంగణాలను మార్మోగించా రు. మండల కేంద్రం వెంకటాపురంలోని మంగపేట రోడ్డువద్ద, శివాలయం ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి విగ్రహ మండపం వద్ద వందలాది మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఉప్పేడు గొల్లగూడెం, చొక్కాల గుడిగుట్ట, సూరవీడు, ఆలుబాక, రామచంద్రపురం తదితర గ్రామాల్లో కూడా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.









