మృత్యువుతో పోరాడి ఓడిన పారిశుధ్య కార్మికుడు
– మేడారం విధులు ముగించుకుని వస్తుండగా ప్రమాదం
– ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వినతి
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర సమయం లో శానిటేషన్ విధులను ముగించుకుని తిరిగి వస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుడిని మృత్యువు కబళించింది. స్వచ్ఛ్ భారత్ వాహనాన్ని నడుపుతూ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ములుగు గట్టమ్మ దేవాలయం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బి. దేవస్వామి 20 రోజులపాటు మృత్యువుతో పోరాడి మంగళ వారం చనిపోయాడు. ఫిబ్రవరి 29న ఆయన ప్రమాదానికి గురయ్యాడు. అదే రోజు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. ఆరు రోజుల అనంతరం ఎంజీఎం నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని డెక్కన్ ఆసుపత్రికి దేవస్వామిని తీసుకెళ్లారు. అక్కడ 14 రోజులు చికిత్స పొందిన ఆయన మంగళవారం మృతిచెందారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో తాము దిక్కులేని వాళ్ళయ్యా మని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.