అక్రమ ఇసుక తవ్వకాలను నియంత్రించాలి
ఏజెన్సీ వనరుల ఆదాయం ఆదివాసీల అభివృద్ధికే కేటాయించాలి
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం హెచ్చరిక
వెంకటాపురం నూగూరు, మే 25, తెలంగాణ జ్యోతి: ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే అరికట్టి, సొసైటీల ద్వారా పాత పద్ధతిలోనే ఇసుక ర్యాంపుల నిర్వహణ కొనసాగించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జెజ్జరీ దామోదర్ డిమాండ్ చేశారు. ఆలుబాక కేంద్రంలో సోమవారం జరిగిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ అడవుల్లోని ఖనిజ సంపద, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం ద్వారా ఆదివాసీల అభివృద్ధిని దెబ్బతీసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70, పేసా చట్టాలు, అటవీ సంరక్షణ చట్టాల అమలు బలహీనపడుతోందని అన్నారు. ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించకుండా స్థానిక ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో వెంకటాపురం మండలంలో పూడిక తొలగింపు పేరుతో భారీ ఎత్తున ఇసుక తరలింపుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు ఆదివాసీ, పేద రైతుల సాగు, తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల జీవవైవిధ్యానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశముందని అన్నారు. వెంటనే ఈ ప్రక్రియను నిలిపివేసి, పాత విధానంలోనే సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపులు నిర్వహించాలని, లేనిపక్షంలో ఆదివాసీ ప్రజలను ఏకం చేసి ప్రత్యక్ష పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం వెంకటాపురం నూతన మండల కమిటీని ఎన్నుకోగా, అధ్యక్షుడిగా పూనెం చందు, కార్యదర్శిగా కాపుల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఇర్ప శ్రీను, కుంజ నారాయణ, కొర్ష వంశి, సోలం నరసింహాస్వామి, మిడం నాగేష్, మడకం చందర్రావు, బొగ్గుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.









