మారుమూల గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు
వెంకటాపురం నూగూరు, మే 20, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గ్రామాల్లో ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నూగూరు, పాత్రపురం గ్రామపంచాయతీల పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా రక్తపోటు, మధుమేహం, గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలు, జ్వరం బాధితులకు రక్తపూత సేకరణ, ఆర్డీటీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు అప్రమత్తంగా ఉండాలని, నిమ్మరసం, ఓఆర్‌ఎస్ తప్పనిసరిగా వాడాలని వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆరోగ్య విస్తరణ అధికారి కుప్పిలి కోటిరెడ్డి, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.








