20న మెడికల్ షాపుల బంద్ పోస్టర్ ఆవిష్కరణ
ప్రజలకు ముందస్తు సూచనలు
వెంకటాపురం నూగూరు, మే 18, తెలంగాణ జ్యోతి: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న మెడికల్ షాపుల బంద్‌కు సంబంధించి వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ములుగు జిల్లా మెడికల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో సత్యదేవ మెడికల్ షాప్ ఎదుట పోస్టర్‌ను ఆవిష్కరించి సభ్యులకు పంపిణీ చేశారు. 20వ తేదీన ప్రతి మెడికల్ షాప్ ముందు పోస్టర్లు అంటించాలని సూచించారు. ఒక్కరోజు బంద్ వల్ల ప్రజలకు అసౌకర్యం కలగొచ్చని క్షమాపణ కోరుతూ, మండల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నెలవారీ మందులు వాడే వారు ముందుగానే మందులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ యూనియన్ సభ్యులు రామకృష్ణ, రామ్మూర్తి, రాంబాబు, అంకారావు, నరహరి, సురేష్, రమేష్, వెంకటేశ్వర్లు, కిషోర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.









