బ్యాంకుల భద్రతపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు
పస్రా ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
గోవిందరావుపేట, మే5, తెలంగాణజ్యోతి: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో బ్యాంకులు, ఏటీఎంల భద్రతపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం జిల్లా ఎస్పీ సుదీర్ రామ్‌నాథ్ కేకే ఆదేశాల మేరకు, డీఎస్పీ రవీందర్ సూచనలతో సీఐ దయాకర్ పర్యవేక్షణలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో మండలంలోని పలు బ్యాంకులను సందర్శించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకులలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్ల పనితీరును పరిశీలించడంతో పాటు, ఏటీఎంల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అలారం సిస్టమ్‌లను సమీక్షించారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అన్న దానిపై అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు. బ్యాంకు మరియు ఏటీఎం సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన బంగారం దుకాణం దోపిడీ ఘటనను ఉదాహరణగా తీసుకుని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. “మీ సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు… ఒక నేరాన్ని అడ్డుకోవచ్చు. మీ సహకారం సురక్షిత సమాజానికి మా బలం” అని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలతో ప్రాంతీయంగా భద్రతా చర్యలు మరింత బలపడతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









