ఏజెన్సీలో అధిక వడ్డీ దందాను నియంత్రించాలి
వెంకటాపురం,మే1,తెలంగాణజ్యోతి: ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న అధిక వడ్డీ వ్యాపారాన్ని తక్షణమే నియంత్రించాలని జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఆంధ్ర ప్రాంతం మరియు వలస వ్యక్తులు అక్రమంగా అధిక వడ్డీ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ ఆదివాసి పేద ప్రజలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వెంకటాపురం మండల తాసిల్దార్ ఎం. వేణుగోపాల్‌కు మెమొరాండం అందజేసిన అనంతరం మాట్లాడుతూ, గ్రామాల్లో వారంవారీ, నెలవారీ వడ్డీల పేరుతో అమాయక గిరిజనులను అప్పుల బారిన పడేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు స్థానిక ఏజెంట్ల సహాయంతో గిరిజన గూడెల్లోనే వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపారం చేయాలంటే 1/70 చట్టానికి లోబడి ఉండాలని, అలాగే 1978 అధిక వడ్డీ నియంత్రణ చట్టం మరియు మనీ లాండరింగ్ చట్టాలను విస్మరిస్తూ ఈ దందా సాగుతోందని మండిపడ్డారు. అక్రమంగా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆదివాసులు స్వయంగా ప్రతిఘటించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.









