జర్నలిస్టు సంఘాల పేరుతో దందా చేస్తే సహించం
TUWJ-IJU ములుగు జిల్లా అధ్యక్షుడు ఎండి. షఫీ అహ్మద్
ములుగు, ఏప్రిల్ 28, తెలంగాణ జ్యోతి: జర్నలిస్టు సంఘాల పేరుతో దందా చేస్తే సహించమని, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ-IJU) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎండి. షఫీ అహ్మద్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు పిట్టల మధుసూదన్, TUWJ-143 జిల్లా కన్వీనర్ దూడబోయిన రాకేష్ సంయుక్త ప్రకటనలో హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు, ప్రెస్ క్లబ్‌లకే చట్టబద్ధత ఉందని స్పష్టం చేశారు. జాక్‌ల పేరుతో జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ములుగు జిల్లాలో గుర్తింపు పొందిన యూనియన్లు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం వేర్వేరు వేదికలపై పోరాడుతున్నప్పటికీ ఒకే నినాదానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు. అయితే కొందరు అసంబద్ధ నిర్ణయాలతో జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమిష్టిగా ఉంటేనే బలం సాధ్యమని, ఎలాంటి గుర్తింపు లేని సంఘాల పేరుతో విడిపోయి సమాజంలో చులకన కావొద్దని పిలుపునిచ్చారు.









