పంచాయతీ నిధుల దుర్వినియోగం.. 31వేల డ్రాపై సందేహం..?
కన్నాయిగూడెం,ఏప్రిల్22,తెలంగాణజ్యోతి: కన్నాయిగూడెం మండలం గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవు తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎటువంటి పనులు చేయకుండానే రూ.31వేలు డ్రాచేసిన విషయం స్థానికంగా చర్చనీయాంశం గా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో, కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు పాలకవర్గాలకు తెలియకుండా ఇష్టారాజ్యంగా నిధులు డ్రా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో చేసిన పనులను మళ్లీ చేసినట్టుగా చూపిస్తూ ఒకే పనిని రెండు మూడు సార్లు నమోదు చేసి లక్షల్లో నిధులు ఉపసంహరించుకున్నట్టు సమాచారం. ఇదే కాకుండా ఎటువంటి పని వివరాలు నమోదు చేయకుండానే రూ.31 వేలు డ్రా చేయడం గమనార్హం. ఈ విషయంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సంబంధిత కార్యదర్శిని ఫోన్లో సంప్రదించగా “నాకు ఈ విషయం గురించి తెలియదు, సిఓ చరణ్‌కు తెలిసి ఉండొచ్చు” అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.









